హైదరాబాద్, వెలుగు: నాగ్‌పూర్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవేను వచ్చే ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మొత్తం 310 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో 280 కిలోమీటర్లు తెలంగాణలోనే ఉందని చెప్పారు. శనివారం శాసనమండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
మంచిర్యాల–వరంగల్ రహదారి పనులను ప్యాకేజీలుగా చేపట్టి టెండర్లు పిలిచామని, భూసేకరణ, కోర్టు కేసుల కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూసేకరణకు సంబంధించిన ఇబ్బందులు చాలావరకు తొలగిపోయాయని, మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని వివరించారు. ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్‌కు గడువు పొడిగించామని, 2027 డిసెంబర్ 31 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
భూసేకరణలో రైతులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, నిర్మాణ పనులు ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వెల్లడించారు. పర్కాల ప్రాంతానికి దగ్గరగా ఎగ్జిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్కాల ఎగ్జిట్‌పై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు వెంటనే ఆదేశాలు ఇస్తామని మంత్రి చెప్పారు.
